అమెరికాకు రష్యా హెచ్చరికలు జారీ చేసింది. రష్యాకు చెందిన పెద్ద చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించడంపై రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మారియా జఖారోవా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆంక్షలు అమెరికాకే నష్టం కలిగిస్తాయని తేల్చి చెప్పారు. అమెరికా నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమని కూడా స్పష్టం చేశారు. ఈ ఆంక్షల ప్రభావం మాస్కోపై కంటే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనే ఎక్కువగా పడుతుందని ఆమె తెలిపారు. ఇంధన ధరలు పెరుగుతాయి, సరఫరా వ్యవస్థ దెబ్బతింటుంది, చివరికి అందరికీ నష్టం జరుగుతుందని అన్నారు. అమెరికా ఆంక్షలతో రష్యా వెనక్కి తగ్గదని కూడా తేల్చేశారు. అమెరికాతో రష్యా చర్చలకు సిద్ధమే కానీ, అవి మీడియాలో మాటల యుద్ధంగా కాకుండా, నిజమైన రాజనీతి చర్చలుగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు.


