అమెరికాలోని క్యాలిఫోర్నియాకు చెందిన టెక్ సంస్థ ఆడోబ్ సీఈవో పదవి నుంచి శంతను నారాయణ్ తప్పుకోనున్నారు. త్వరలోనే ఆయన తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఆడోబ్ కంపెనీ వెల్లడించింది. శంతను 18 ఏళ్లుగా ఆడోబ్ సీఈవోగా కొనసాగుతున్నారు. ఆయన 2007 డిసెంబర్‌లో సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. కొత్త సీఈవోను ఎంపిక చేసే వరకు శంతను సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. కొత్త సీఈవో వచ్చిన తర్వాత ఆయనకు బాధ్యతలు అప్పగించి, శంతను పదవి నుంచి తప్పుకొంటారు.
అయితే, తాను సీఈవోగా మాత్రమే తప్పుకొంటున్నానని, కానీ, బోర్డ్ ఛైర్మన్‌గా కొనసాగుతానని తెలిపారు. ఆడోబ్ కంపెనీతో అనుబంధం కొనసాగుతుందని, బోర్డ్ ఛైర్మన్‌గా నిరంతరం సంస్థ కోసం పని చేస్తూనే ఉంటానని శంతను తన ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. శంతను తప్పుకోవడానికి గల కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కానీ, ప్రస్తుతం ఏఐ వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆడోబ్ భవితవ్యంపై ఇన్వెస్టర్లు, ప్రమోటర్లలో ఆందోళన నెలకొంది. దీంతో ఆడోబ్ సీఈవోగా కొత్తవారిని నియమించాలనే ఆలోచన సంబంధిత వర్గాలు చేశాయి. దీంతో ఆయన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


