పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.13 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధం విధించనున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు నష్టపోవద్దనే సంకల్పానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. స్వప్రయోజనాల కోసం సాంకేతికతను ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని , దానికి బానిసై చెడుకు ఉపయోగిస్తే నాశనమవుతారని అన్నారు. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని సూచన వచ్చిందని, వారికి సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేసే కార్యక్రమానికి 90 రోజుల్లో శ్రీకారం చుడతామని, 13-16 ఏళ్ల లోపు వారికి ఏం చేయాలన్నదానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.


