తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానమీ కోసం తాము పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. జహీరాబాద్ లాంటి ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం తాము కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కొండాపూర్ మండలం తొగర్‌పల్లిలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహలు పర్యటించారు. రూ.650 కోట్ల పెట్టుబడితో 44 ఎకరాల్లో భారీ ఫుడ్ ఇండస్ట్రీకి మంత్రులు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. 1500 మంది స్థానిక మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా కేజేఎస్ యూనిట్–ఈఈకి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. తొగర్‌పల్లిలో ఇంత పెద్ద పరిశ్రమ రావడానికి టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కారణమని చెప్పుకొచ్చారు. 1500 మంది మహిళలకు ఈ పరిశ్రమతో ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ పరిశ్రమ పూర్తిగా కాలుష్య రహితమని అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో అంతర్జాతీయ కారిడార్‌లో ఓ ఇండస్ట్రీ నెలకొల్పుతామని వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అంతర్జాతీయ సదస్సులో పాల్గొని పరిశ్రమల కోసం పెట్టుబడులను ఆకర్శిస్తున్నామని చెప్పుకొచ్చారు. స్థానిక యువతకు ఉపాధే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని తెలిపారు. రాబోయే కాలంలో 2047 నాటికి దేశ జాతీయ ఉత్పత్తిలో 10 శాతం ఉత్పత్తి పెంచేలా తాము పనిచేస్తున్నామని పేర్కొన్నారు.


