ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ ఉంటుందన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ డేటా లేక్‌తో కుటుంబం, వ్యక్తుల వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు, పౌరసేవల పర్యవేక్షణకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ ఒక్కటే ఉంటుందని తెలిపారు. కుటుంబ సాధికారిత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని చంద్రబాబు సూచించారు. కుటుంబం ఒక యూనిట్‌గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం అమలు చేయాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ నాటికి క్యూఆర్ కోడ్‌తో కూడిన ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని అధికారులకు సూచించారు. 25 రకాల సేవలతో పాటు పీ4 లాంటి అంశాలను అందులో చేర్చాలని తెలిపారు. ఆర్టీజీఎస్ వద్ద ఉన్న సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇతర ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవాలని చెప్పారు. స్టాటిక్ డేటా, డైనమిక్ డేటా వివరాలను కూడా ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చూడాలన్నారు.


