ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్స్‌రహిత రాష్ట్రంగా మార్చేందుకు అందరూ సహకారం అందించాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డ్రగ్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నషా ముక్త్ భారత్ అభియాన్ – విక్షిత్ భారత్ కీ పెహచాన్ థీమ్‌తో నిర్వహించి వర్క్‌షాప్‌కు హోం మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ గంజాయి మత్తులో పడి జైల్లో ఉన్న బిడ్డను విడుదల చేసేందకు ఏ పేరెంట్స్ కూడా ముందుకు రారన్నారు. హోం మంత్రి అయిన కొత్తలో ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి చెప్పిన విషయం షాక్‌కు గురయ్యేలా చేసిందన్నారు. నాలుగో తరగతి చదువుతున్న పిల్లాడు గంజాయికి బానిసయ్యాడంటూ సదరు వ్యక్తి చెప్పిన విషయం విని భయాందోళనకు గురైనట్లు చెప్పారు.
ఈగల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని, నిర్మానుష్య ప్రదేశాల్లో డ్రోన్స్ తిరుగుతున్నాయని హోం మంత్రి తెలిపారు. ఎక్కడో చెట్టు కింద కూర్చొని గంజాయి తీసుకున్నా కూడా డ్రోన్ పట్టేస్తుందన్నారు. అంత స్ట్రిక్ట్‌గా సర్వైలెన్స్ పనిచేస్తున్నాయని చెప్పారు. విజయవాడ కమిషనరేట్‌లో ఏ మూలకు వెళ్లినా సీసీటీవీ కెమెరాలు పనిచేసే పరిస్థితులు ఉన్నాయన్నారు. భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని యువతకు సూచించారు. భవిష్యత్తు బాగుండాలంటే డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, గంజాయి వినియోగంపై 1972 నంబర్ కు సమాచారం ఇవ్వాలని అనిత సూచించారు.

































