టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ సీఈవోగా ఉన్న సుందర్ పిచాయ్ వేతనం భారీగా పెరిగింది. ఆయన వేతనాన్ని మూడేళ్ల కాలానికిగాను రూ.6,361 కోట్లు (692 మిలియన్ డాలర్లు)గా నిర్ణయిస్తూ గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈవోల్లో ఒకరిగా సుందర్ పిచాయ్ నిలిచారు.
అందులోనూ ఆల్ఫాబెట్ షేర్ హోల్డర్లకు సంబంధించి టార్గెట్ రీచ్ అయితే, సుందర్ పిచాయ్‌కు అందే విలువ డబుల్ అవుతుంది. అంటే 126 మిలియన్ డాలర్ల షేర్ల విలువ 252 మిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. మరో 2 మిలియన్ డాలర్లు వార్షిక వేతనం కింద అందగా, స్టాక్ వెస్టింగ్ ద్వారా మూడేళ్లపాటు 84 మిలియన్ డాలర్లు అందుకుంటారు. అలాగే 350 మిలియన్ల వరకు స్టాక్ ఇన్సెంటివ్స్ అందుతాయి. అలాగే కంపెనీకి చెందిన వెయిమో స్టాక్స్ ద్వారా 130 మిలియన్ డాలర్లు, వింగ్ ఏవియేషన్ షేర్ల ద్వారా 45 మిలియన్ డాలర్లు దక్కుతాయి. వీటిలో టార్గెట్ వాల్యూని షేర్లు మించిపోతే 200 శాతం షేర్లు పెరుగుతాయి. ఎన్నో సమస్యల్ని అధిగమించి కంపెనీని అగ్రభాగాన నిలబెడుతున్న సుందర్ పిచాయ్ నాయకత్వంపై ఆల్ఫాబెట్ కంపెనీ విశ్వాసంతో ఉంది.


