తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ కమిషన్ సమర్పించిన సిఫార్సుల మేరకు పలు కులాల పేర్లను మారుస్తూ, మరికొన్ని కులాలకు గౌరవప్రదమైన పర్యాయపదాలను జోడిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. బీసీ జాబితాలోని గ్రూప్-ఎ, గ్రూప్-డీ విభాగాల్లో ఈ మార్పులు చేపట్టింది. ఈ క్రమంలో గ్రూప్-ఏ లోని వరుస సంఖ్య 7లో ఇప్పటి వరకు ఉన్న దొమ్మర అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో గడ వంశీయ అనే పేరును అధికారికంగా ఖరారు చేసింది. అలాగే, వరుస సంఖ్య 18లో ఉన్న పిచ్చకుంట్ల అనే పదాన్ని మారుస్తూ, ఇకపై ఆ కులాన్ని వంశ రాజ్ గా వ్యవహరించాలని నిర్ణయించింది. వరుస సంఖ్య 4లో ఉన్న బుడబుక్కల కులానికి శివ క్షత్రియ అనే పదాన్ని పర్యాయపదంగా చేర్చడం ద్వారా, రికార్డుల్లో వీరిని ఇకపై బుడబుక్కల, శివ క్షత్రియ గా నమోదు చేయనున్నారు. అదేవిధంగా వరుస సంఖ్య 5లో ఉన్న వన్నార్అ నే పదాన్ని తొలగించి, ఆ స్థానంలో ధోబీ అనే పదాన్ని చేర్చడం ద్వారా మొత్తంగా వీరిని రజక, చాకలి, ధోబీ గా పేర్కొంటారు. వీటితో పాటు సీ గ్రూప్-డి విభాగంలో కూడా ప్రభుత్వం పలు మార్పులు చేపట్టింది. ముఖ్యంగా వరుస సంఖ్య 29లో ఉన్న శూద్ర కులం అనే పదాన్ని ప్రభుత్వం రికార్డుల నుంచి పూర్తిగా తొలగించి, దాని స్థానంలో తమ్మలి (బ్రాహ్మణేతర) గా పేరు మార్చింది. అలాగే వరుస సంఖ్య 5లో ఉన్న కులానికి మేరు అనే పదాన్ని అదనంగా జోడించి, ఇకపై వీరిని మేర, మేరు, చిప్పోలు గా గుర్తించాలని నిర్ణయించింది.


