ఐక్యరాజ్యసమితి లో పాకిస్థాన్ వైఖరిని భారత్ మరోసారి ఎండగట్టింది. ఆపరేషన్ సిందూర్ పై ఆ దేశ రాయబారి చేసిన తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టింది. ఉగ్రవాదాన్ని చట్టబద్ధం చేసేందుకు ఆ దేశం ప్రయత్నిస్తోందని మండిపడింది. ఈ మేరకు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ఘాటుగా స్పందించారు. అంతర్జాతీయ వేదికల్లో పాకిస్థాన్ ప్రతిసారీ భారత్‌కు, దేశ ప్రజలకు హాని కలిగించడమే అజెండాగా పెట్టుకుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు. జమ్ముకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని హరీశ్ పునరుద్ఘాటించారు. భారత అంతర్గత అంశాలపై వ్యాఖ్యానించే హక్కు పాకిస్థాన్‌కు లేదన్నారు. 65 ఏళ్ల క్రితం విశ్వాసం, స్నేహం స్ఫూర్తితో భారత్ సింధూ జలాల ఒప్పందం చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అన్నారు. అందుకే భారత్ ఆ ఒప్పందాన్ని నిలిపివేసిందని తెలిపారు.


