ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది వేళ కీలక వ్యాఖ్యలు చేసారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉగాదిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ వేడుకగా ఉగాది జరుపుకుని పంచాంగ శ్రవణం చేస్తారని తెలిపారు. మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించే గౌరవం తనకు దక్కిందన్నారు. ఆ తదుపరి కృష్ణా పుష్కరాలు కూడా వస్తున్నాయని తెలిపారు.రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఉగాది పచ్చడి జీవితాన్ని ప్రతిబింబిస్తుందని, పులుపు, తీపి, వగరు, చేదు, కారం వంటి రుచులు ఉంటాయన్నారు. జీవితంలో కష్టసుఖాలు, ఆనంద దుఃఖాల్లాగే ఈ రుచులన్నీ కలగలిసి ఉంటాయని వివరించారు.తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉగాదిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సంవత్సరం 38 మందికి కళారత్న అవార్డులు, 122 మందికి ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారని, వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు సంస్కృతి వినూత్నమైనది, పండుగలు విభిన్నమైనవి, ప్రకృతిని ఆరాధించడం, ఆరోగ్యకర జీవన విధానానికి ప్రతీకలుగా ఉంటాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.


