ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ స్టేట్ వెల్ఫేర్ బోర్డుకు కొత్త సభ్యులను నియమిస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్‌జెండర్ హక్కుల పరిరక్షణ చట్టం-2019 ప్రకారం ఈ నియామకాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ స్టేట్ వెల్ఫేర్ బోర్డులో నామినేట్ సభ్యులుగా ముగ్గురు ట్రాన్స్‌జెండర్ ప్రతినిధులకు అవకాశం కల్పించింది. కోట ప్రేమ్ సాగర్ రాయ్, నక్క జీవన్ కుమారి, బోను దుర్గలను బోర్డు సభ్యులుగా నియమించింది. ఈ నియామకాల ద్వారా ట్రాన్స్‌జెండర్లకు సంబంధించిన సమస్యలు నేరుగా ప్రభుత్వ దృష్టికి వెళ్లే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, నియమిత సభ్యుల పదవీకాలం రెండేళ్ల పాటు ఉంటుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నియామకాలు అమల్లో ఉంటాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.


