మాజీ సిఎం కెసిఆర్ పార్టీకే మనుగడ లేదని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి గతం ఉందని, భవిష్యత్ లేదని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై సిఎం స్పందించారు. అసెంబ్లీ ప్రాంగణంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొత్త పార్టీ సంగతి తరువాత, ఉన్న పార్టీ ఉంటుందా, ఊడుతుందా? అని ప్రశ్నించారు. ఉద్యమం అప్పుడు ఎలా మాట్లాడినా సహంచారని, అధికారంలో ఉన్న పదేళ్లు కూడా అలాగే మాట్లాడారని అన్నారు. కెసిఆర్ కుటుంబానికి, బిఆర్ఎస్ పార్టీకి ప్రజలతో సంబంధాలు లేవని, కెసిఆర్ కుటుంబ సభ్యులు తెచ్చి పెట్టుకున్న నటన చేస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ కుటుంబంమంతా ఒక్కటేనని, రంగు రుచి లేదని, కుటుంబ పెద్ద తర్వాత వారసత్వం వస్తుందని పేర్కొన్నారు. కెసిఆర్ చనిపోతే తనకేం వస్తుందని, కెసిఆర్ చావు తాను ఎందుకు కోరుకుంటానని రేవంత్ ప్రశ్నించారు. కెసిఆర్ ఆరోగ్యంగా ఉంటేనే తనకు మంచిదని, కెసిఆర్ విశ్రాంతిలో ఉన్న ప్రజాప్రతినిధి అని తెలియజేశారు.
కెసిఆర్ మర మనిషో, కాదో కుటుంబసభ్యులకే తెలుసు అని వివక్ష లేని పాలన కాంగ్రెస్ దని, తమకు ప్రతిపక్షమే లేదని చెప్పారు. కెసిఆర్ కు చిత్తశుద్ధి ఉంటే కవిత మాటలకు సమాధానం చెప్పాలని, కవిత చెబుతున్నట్లు కెసిఆర్ ఎవరి బందీలో ఉన్నారని ప్రశ్నించారు. కెసిఆర్ మర మనిషా, మనసున్న మనిషా కవితకు జవాబివ్వాలని, బిజెపితో పొత్తు పెట్టుకోనని కెసిఆర్ దేవుడిపై ఒట్టు వేస్తారా? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ఎక్స్ పైరీ గడువు తీరిందని, ఇక ఆ పార్టీతో పనిలేదని, బిఆర్ఎస్ పార్టీ చచ్చిన శవంతో సమానం అని అన్నారు. కెసిఆర్ తన శత్రువు కాదని, రాజకీయ ప్రత్యర్థి అని కెసిఆర్ కు చెడు జరగాలని కోరుకుంటోంది, ఆయన కుటుంబమేనని రేవంత్ రెడ్డి తెలియజేశారు.


