కాంగ్రెస్ ప్రభుత్వం డీలిమేషన్ ను వ్యతిరేకించడం దారుణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. డీలిమేషన్ తో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని అన్నారు. ఈ సందర్భంగా డీలిమేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను బంట్రోతు ఉద్యోగం చేస్తానని ముఖ్యమంత్రి విమర్శిస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలను కాంగ్రెస్ బంట్రోతులుగా చూసిందని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి అద్దాల మేడలో కూర్చోని ఇతరులపై రాళ్లు విసురుతున్నారని, అనేక రకాలుగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని విమర్శించారు. కర్నాటక సిఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమయం కూడా ఇవ్వలేదని, రేవంత్ రెడ్డి డబ్బుతో రాజకీయంగా మనుగడ సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ తర్వాత అత్యంత మేధావి రేవంత్ రెడ్డినే, సిఎం చెబుతున్న హైబ్రిడ్ మోడల్ ఎక్కడా లేదని అన్నారు. రాజ్యాంగాన్ని సవరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, 543 ఎంపి స్థానాలకు 850కి పెంచాలని, రాష్ట్రాలకు 815, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 ఎంపి స్థానాలు ప్రతిపాదించామని తెలియజేశారు.


