సముద్రంలో చేపల వేట చాలా కష్టమైన పని అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలో సీఎం పర్యటించారు. నెల్లూరు జిల్లా తుమ్మలపెంట వేదికగా మత్స్యకారుల సేవ కార్యక్రమం జరిగింది. మత్స్యకారుల సేవ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ చేపల వేటకు ఎంతో ధైర్యం కావాలని అన్నారు. ఉవ్వెత్తున ఎగిసినపడే అలలకు సైతం ఎదురెళ్లే గుండె ధైర్యం కావాలని, జీవనోపాధి కోసం కుటుంబాలను వదిలి రోజులరబడి వెళ్తారని తెలియజేశారు. మత్స్య కారులు ఎన్నో రోజులు సముద్రంలోనే గడుపుతారని, తుఫాను వస్తే కుటుంబసభ్యులకు సమాచారం కూడా ఇవ్వలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.
మత్స్య కారులకు ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని, చరిత్రలో తొలిసారిగా రూ. 260 కోట్లు మత్స్యకారుల ఖాతాల్లో వేశామని పేర్కొన్నారు. నిరుడు 1,21, 433 కుటుంబాలకు రూ.243 కోట్ల సాయం, 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయం అందించామని అన్నారు. సముద్రం లో వేట నిలిచిపోతే పూట గడిచే పరిస్థితి లేదని, వేట నిషేధ సమయంలో రూ.20 వేలు ఆర్థిక భరోసా ఇస్తున్నామని, 2014-19లో మత్స్య సంపద ఉత్పత్తి 19.18 శాతం పెరిగిందని అన్నారు. తీరం మనదే, బోటు మనదే, వేట కూడా మనదే ఎవరైనా మన తీర ప్రాంతంలోకి వస్తే వేటాడుదాం, వెంటాడుదాం అని హెచ్చరించారు.


