ఇటీవల ప్రపంచ రాజకీయాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ఆకాశ మార్గాలకూ ముప్పుగా మారుతున్నాయి. అమెరికా విమానయాన సంస్థలకు ఎఫ్‌ఏఏ (ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్) హెచ్చరికలు జారీ చేసింది. సైనిక కార్యకలాపాల నేపథ్యంలో మెక్సికో, సెంట్రల్ అమెరికా, పనామా సహా తూర్పు పసిఫిక్ మహా సముద్రంలోని కొన్ని ప్రాంతాల గగనతలం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఈ నోటీసు 60 రోజుల వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. విమానం ఎంత ఎత్తులో ఉన్నా,ల్యాండింగ్, టేకాఫ్ దశల్లో ఉన్నా సరే, వాటికి ముప్పు ఎదురయ్యే ప్రమాదం ఉంది అని ఎఫ్‌ఏఏ ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికాకు చెందిన అన్ని విమానయాన సంస్థలకు అడ్వైజరీ నోటీసు జారీ చేసింది.
యుద్ధ సమయాల్లో ఇచ్చే ఆదేశాలు సాధారణంగా యుద్ధాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు లేదా సైనిక దాడుల భయం ఉన్నప్పుడు మాత్రమే ఈ తరహా హెచ్చరికలు జారీ చేస్తారు. అందుకే ఈ అడ్వైజరీలు ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ముఖ్యంగా మెక్సికో, లాటిన్ అమెరికా దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఈ పరిణామాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి.


