ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచస్థాయి క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా రూపుదిద్దుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రాత్మక ముందడుగు వేశారు. తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి పునాదిరాయి పడింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ రాష్ట్రానికి, దేశానికి మైలురాయిగా నిలవనుంది. భారతదేశంలోనే మొదటి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌కు అమరావతి వేదిక కానుంది.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహా మంత్రులు నారా లోకేశ్, నారాయణ, కందుల దుర్గేశ్, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.


