తిరుమల వేంకటేశుడి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తమ విచారణను ముగించింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు ఛార్జ్‌షీటు దాఖలు చేసే అవకాశం ఉంది. గత 15 నెలలుగా 12 రాష్ట్రాల్లో ఈ కేసు విచారణ సాగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారణకు సిట్‌ను నియమించగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
మొదట్లో తమిళనాడులోనే కేసు మూలాలు ఉన్నాయని దర్యాప్తు బృందాలు భావించాయి. తీగలాగితే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన భోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ల డొంక కదిలింది. వారినే కల్తీ నెయ్యి కేసులో కీలక సూత్రధారులుగా దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా తదితర 12 రాష్ట్రాలకు చెందిన సంస్థలు, వ్యక్తుల హస్తం ఈ కేసులో ఉన్నట్టు వెల్లడైంది. విచారణలో సీబీఐకి చెందిన డీఎస్పీలు, సీఐలతో పాటు రాష్ట్రానికి చెందిన 30 మంది అధికారులు పాల్గొన్నారు.
కల్తీ నెయ్యికి రసాయనాల కొనుగోళ్లు, టీటీడీ నుంచి నగదు ఎవరెవరికి చెల్లించారు? కల్తీ నెయ్యి అని తెలిసినా,తిరుమలకు అనుమతించిన వారెవరు? ఎంత మొత్తాలు లంచంగా తీసుకున్నారు? అనే అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరిగింది. తొలి ఛార్జ్షీటులో 24 మందిని నిందితులుగా పేర్కొన్న దర్యాప్తు బృందాలు, మరో 12 మంది హస్తం ఉన్నట్టు కోర్టుకు తెలిపాయి.


