జాతీయ జెండా దేశానికి గౌరవం, పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వాసం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మహానాడు ప్రారంభం సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. విజన్ పాలిటిక్స్‌కు తెలుగుదేశం పార్టీ నాంది అని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్ని అద్భుతాలేనని, ప్రతి అడుగు సంచలనమేనని పేర్కొన్నారు. 1875 క్లస్టర్‌ల వేదికగా ఈసారి మహానాడు జరుగుతోందని తెలిపారు. లక్షలాది మంది కార్యకర్తలు తొలిరోజే అదరగొట్టారని ప్రశంసించారు. పశ్చిమాసియా యుద్ధవాతావరణం మూలంగా మహానాడును వర్చువల్‌గా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని 44 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ తెలుగుదేశం అని వ్యాఖ్యానించారు. సంక్షేమం, అభివృద్ధి సుపరిపాలనను టీడీపీ పరిచయం చేసిందని ప్రస్తావించారు. జెండర్ ఈ క్వాలిటీ, సామాజిక సమస్యలపై తెలుగుదేశం పోరాడిందని పేర్కొన్నారు.
వర్చువల్ మహానాడు కారణంగా వాహానాల హోరు తగ్గిందేమో కానీ, కార్యకర్తల్లో జోరు మాత్రం తగ్గలేదని చెప్పుకొచ్చారు. 45 ఏళ్లుగా ప్రజాసమస్యల కోసం టీడీపీ నిరంతర పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం కోసం టీడీపీ నిలిచింది. ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్నాం. ప్రజలు ఆదరించి, ఆశీర్వదించి రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత అప్పగించారు. పాలనలో అగ్రెసివ్‌గా, ప్రోగ్రెసివ్‌గా ముందుకు వెళ్తున్నాం. మహిళా సాధికారిత, సామాజిక, ఆర్థిక రాజకీయ గౌరవం కోసం టీడీపీ పనిచేస్తోంది. ఆస్తి హక్కు నుంచి, నేడు తల్లికి వందనం వరకూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించటంతో పాటు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు సాధించే వరకూ టీడీపీ వారి వెనుక ఉంటుంది అని చంద్రబాబు పేర్కొన్నారు.


