మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రం లోక్‌సభ లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. బిల్లు విషయంలో విపక్షాలు చాలా పెద్ద తప్పు చేశాయని, అందుకు జీవితాంతం చింతిస్తాయని అన్నారు. ప్రధాని అధ్యక్షతన ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో శనివారం కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది.
ఆ సమావేశంలో ప్రధాని మోదీ విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీలు పెద్ద తప్పు చేశాయని అన్నారు. అందుకు వారు భారీ మూల్యం చెల్లించక తప్పదని వ్యాఖ్యానించారు. బిల్లును వ్యతిరేకించి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సాకులు వెతుకుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు మహిళలకు వ్యతిరేకమనే విషయాన్ని ప్రతి గ్రామానికి చేరేలా తెలియజేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.


