అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్- నా రాజధాని అమరావతి అని ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చరిత్రాత్మకమైన రోజుకు దేశ పార్లమెంట్ వేదిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని నినాదంతో అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానానికి చట్టబద్ధత కల్పించే అమరావతి బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, ఆమోదించడం కోట్లాది ప్రజలు గర్వించదగ్గ సందర్భం. అమరావతి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన పార్టీలకు కృతజ్ఞతలు. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష. అమరావతి విజయం. ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం. ఇది రైతుల త్యాగాలకు దక్కిన దైవ ఆశీస్సులు. శాంతియుత పోరాటానికి దక్కిన ఫలితం. కోట్లాది ప్రజల కోరికను గౌరవించిన కేంద్రం ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా చరిత్ర-సంస్కృతికి ఆలవాలమైన అమరావతిని నిలిపింది. జై ఆంధ్రప్రదేశ్ జయహో అమరావతి అంటూ లోకేశ్ పేర్కొన్నారు.


