ప్రజా సమస్యలను వంద శాతం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో ఏడో విడత కలెక్టర్ల సదస్సులో అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. అత్యుత్తమ విధానాలు ఎక్కడున్నా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. సింగపూర్‌లో అనుసరిస్తున్న పాలనా విధానాలు అక్కడి ప్రజల విశ్వాసాన్ని దక్కించుకున్నాయని చెప్పారు. సింగపూర్‌లోని అత్యుత్తమ విధానాలను తీసుకుని ఓ జిల్లాను మోడల్‌గా అభివృద్ధి చేద్దామని అన్నారు. సింగపూర్ విధానాల అమలుకు 90 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేసి పర్యవేక్షణ చేయాలని సూచించారు. నేను కాదు మనం అనే విధానంలో ముందుకు వెళ్తాం. ఈ విధానం నేటి నుంచి నాతో మొదలవుతుంది అని సీఎం పేర్కొన్నారు.
బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి చెందాలని వెల్లడించారు. రాష్ట్రంలో రోజుకో ఎంఓయూ, వారానికో శంకుస్థాపన జరుగుతోందన్నారు. వేగంగా పనిచేయాలని, అంతే వేగంగా అభివృద్ధి చూపించాలని సూచించారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ స్లోగన్‌కే పరిమితం కాకూడదన్నారు. పబ్లిక్ రిలేషన్స్ ఎంత ముఖ్యమో, పబ్లిక్ డెలివరీ అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. వినూత్నంగా ఆలోచిస్తే నిధుల కొరతను అధిగమించవచ్చన్నారు. జిల్లా కలెక్టర్ల మధ్య అభివృద్ధిలో పోటీ ఉండాలని తెలిపారు. కాలేజీ రోజుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ డ్రైవ్ చేశానని, ఇప్పుడు ఆ సంస్థను ఏపీకి తెచ్చామని తెలిపారు.


