వికసిత్ భారత్ రోజ్‌గార్ పథకంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తిరుపతి జిల్లాలోని ముక్కువారిపల్లిలో వీబీ -జీ రామ్ జీ పథకానికి శ్రీకారం చుట్టారు. సీఎం చంద్రబాబుతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భం గా చంద్రబాబు ప్రసంగించారు. ఈ పథకం ఆయా గ్రామాల ముఖచిత్రం మారుస్తుందని పేర్కొన్నారు. ఈ పథకంతో పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయని తెలిపారు. కూటమి హయాంలో ఏపీ అన్నివిధాలా అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్యానించారు.
ఉత్తరాంధ్రకు గూగుల్ డేటా సెంటర్ వస్తోందని తెలిపారు. పుట్టపర్తికి ఫైటర్ జెట్ పరిశ్రమ రాబోతోందని చెప్పుకొచ్చారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని పునరుద్ఘాటించారు. జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయబోతున్నామని తెలిపారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. ఏడాదికి 185 రోజులు పేదవాళ్లకు ఈ పథకం పని కల్పిస్తుందని వివరించారు. దొంగ లెక్కలు రాసుకోలేని విధంగా డిజిటల్ విధానాన్ని ఈ పథకంలో అమల్లోకి తీసుకువచ్చారని అన్నారు. వీబీ -జీ రామ్ జీ పథకంలో రాష్ట్రాల వాటా 10శాతం నుంచి 40శాతం పెరిగిందని చెప్పుకొచ్చారు. కేంద్రప్రభుత్వం కొత్త ఆలోచనలు, విధానాలతో ముందుకెళ్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ అగ్రదేశంగా మారుతుందని వివరించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంలో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని పేర్కొన్నారు.
…………

































