లోక్‌సభలో ఇద్దరు ఎంపీలు తమ వేతనం తీసుకోవడం లేదు. వారిలో ఒకరు బీజేపీ ఎంపీ కాగా మరొకరు కాంగ్రెస్ ఎంపీ. బీజేపీకి చెందిన హర్యానాలోని కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్, కాంగ్రెస్‌కు చెందిన ఇన్నర్ మణిపూర్ ఎంపీ డాక్టర్ బిమోల్ అకోయిజామ్ అంగోమ్చా తమ జీతాలు తీసుకోకూడదని నిర్ణయించారు. అంతేగాక అధికారిక భత్యాలతోపాటు ప్రోత్సాహకాలను కూడా నవీన్ జిందాల్ తీసుకోవడం లేదు. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు లోక్‌సభ సెక్రటేరియట్ ఈ మేరకు సమాధానం ఇచ్చింది.
కాగా, బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ ఎన్నికల అఫిడవిట్‌లో రూ.1,241 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించారు. ఇన్నర్ మణిపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ బిమోల్ అకోయిజామ్ అంగోమ్చా సుమారు రూ.97 లక్షల ఆస్తులను వెల్లడించారు. మరోవైపు 18వ లోక్‌సభలో అత్యంత ధనవంతులైన సభ్యులలో నవీన్ జిందాల్ ఒకరు మాత్రమే. అత్యంత ధనవంతుడైన సభ్యుడు మాత్రం ఆయన కాదు. గుంటూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీ చంద్రశేఖర్ పెమ్మసాని ఈ ప్రత్యేకత దక్కించుకున్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.5,705 కోట్లకు పైగా ఉన్నది. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రూ.4,568 కోట్లకు పైగా ఆస్తుల ప్రకటనతో రెండో స్థానంలో ఉన్నారు.


