మత్స్యకారుల వలసలు తగ్గించి, తీరప్రాంతాల్లోని వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం ముందు ఉన్న లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. వరుసగా రెండో ఏడాది మత్స్యకార సేవలో పథకం నిధులు విడుదల చేశామని తెలిపారు. అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.20 వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నామని వివరించారు.
గత ప్రభుత్వం రూ.10 వేలు మాత్రమే ఇచ్చిందని.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని రెట్టింపు చేసిందని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుందన్నారు. ఈ పథకం కోసం మొత్తం రూ.262 కోట్లను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. కాకినాడ జిల్లాలో 24,930 మంది లబ్ధిదారులకు రూ.49.86 కోట్లు, పిఠాపురం నియోజకవర్గంలో 6,897 మంది లబ్ధిదారులకు రూ.13.79 కోట్ల మేర లబ్ధి చేకూరనుందని వివరించారు. మత్స్యకారుల వలసలు తగ్గించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. కాకినాడ జిల్లాలోని 119 కిలోమీటర్ల కోస్తా తీర పరిధిలో 23 ల్యాండింగ్ సెంటర్లతోపాటు 51 మత్స్యకార గ్రామాల ప్రజలకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పలు పథకాలు వారికి ఎంతగానో ఆసరాగా నిలుస్తున్నాయన్నారు.


