ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్.ఐ.ఆర్)పై తాము సాగిస్తున్న పోరాటం కొనసాగుతుందని, ప్రజల ఓటింగ్ హక్కులను లాక్కునేందుకు ప్రధానమంత్రి మోదీ చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. రంజాన్ సందర్భంగా సెంట్రల్ కోల్‌కతాలో జరిగిన వేడుకలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చేపట్టిన విస్తృత ప్రయత్నంలో భాగమే ఎస్‌ఐఆర్ ప్రక్రియ అని విమర్శించారు. మీ ఓటింగ్ హక్కులను లాక్కునేందుకు మోదీ చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా మేము అడ్డుకుంటాం. ప్రజాస్వామ్యం, ప్రజా హక్కులను పరిరక్షించేందుకు చివరి వరకూ పోరాడతాం అని చెప్పారు. రివిజన్, వెరిఫికేషన్ పేరుతో ఓటర్ల హక్కులను కొల్లగొట్టే ఎలాంటి చర్యలనైనా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. బెంగాల్‌ను, ప్రజలను విడగొట్టేందుకు ప్రయత్నించే వారికి పరాభవం తప్పదన్నారు.
మతసామరస్యం పశ్చిమబెంగాల్ ప్రత్యేకత అని, ఇక్కడ హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి జీవిస్తుంటారని సీఎం గుర్తుచేశారు. సమాజాన్ని విడగొట్టే శక్తులను తిప్పిగొడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పాల్గొన్నారు.


