ప్రస్తుత సంక్షోభ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని ఇండియాకు తీసుకొస్తామని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని ప్రధాని మోదీ అన్నారు. ఒకవైపు ప్రపంచం సంక్షోభంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని మోదీ విమర్శించారు. కేరళంలోని కోచిలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీయే కూటమి నిర్వహించిన ఒక కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. త్వరలో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ అక్కడి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని వదిలిపెట్టబోం. వారిని ఇండియాకు తీసుకొస్తాం. పశ్చిమాసియా సంక్షోభంలో మిగిలిపోయిన భారతీయులకు తగిన సాయం అందిస్తున్నాం. వాళ్ల క్షేమం, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్న భారతీయుల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్న అక్కడి ప్రభుత్వాలకు కృతజ్ఞతలు. మనవారి సేవలు గుర్తించి, తగిన సహాయం అందిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు. ఆయా దేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలు కూడా నిరంతరం పని చేస్తున్నాయి. ఒకవైపు ప్రపంచం సంక్షోభంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ దీనిపై రాజకీయం చేస్తోంది. రెచ్చగొట్టేలా, బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తోంది. విదేశాల్లో ఉన్న భారతీయుల విషయంలో రాజకీయం చేయడం తగదు.


