తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడాది నిర్వహించే మహానాడును ఈ సారి నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలో మంత్రి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడారు. మహానాడును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. మహానాడును ఇఫ్కోసెజ్‌లో నిర్వహించాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు. అక్కడ రెండు వేల ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తున్నామని,ఈ నెల 6వ తేదీన పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. రాష్ట్రం, ప్రజల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలను మహానాడులో తీసుకుంటామని, ప్రజలకు పలు హామీలు ఇస్తామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది మహానాడుకు రానున్నారని చెప్పుకొచ్చారు. ట్రాఫిక్, ఇతర సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.


