ఒకవేళ హోర్ముజ్ జలసంధిని ఇరాన్ తెరవకున్నా, ఆ దేశంపై చేపట్టిన యుద్ధాన్ని నిలిపివేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన సహచరులతో వెల్లడించినట్లు తెలుస్తోంది. హోర్ముజ్‌ను మరో సందర్భంలో తెరిచేందుకు వత్తిడి చేయనున్న పేర్కొన్నారు. ట్రంప్ సర్కారులో ఉన్న అధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హోర్ముజ్ జలసంధిని విదేశీ నౌకలకు ఓపెన్ చేసే వరకు ఇరాన్ అంతుచూస్తామని ట్రంప్ పదేపదే వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్‌పై ఆపరేషన్‌ను కేవలం నాలుగు నుంచి ఆరు వారాల వరకు మాత్రమే అంచనా వేసి అమెరికా దాడులకు దిగింది. ఒకవేళ జలసంధి అంశంలో సందిగ్ధత కొనసాగితే యుద్ధం ముగింపు మరింత ఆలస్యం అవుతుందని, దీని వల్ల టైమ్‌లైన్ కూడా దాటినట్లు అవుతుందని అమెరికా అంచనా వేస్తున్నది. ఇరాన్ నేవీని దెబ్బతీయడం, క్షిపణి నిల్వలను పేల్చివేయడం లాంటి నిర్ణయాలను వేగవంతం చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు కూడా ఆ కథనంలో తెలిపారు. అయితే వాణిజ్యం అంశంలో టెహ్రాన్‌తో దౌత్యపరమైన వత్తిడి తీసుకువచ్చి ఉద్రిక్తతలను తగ్గించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు.


