పోలీసు అధికారి నిర్లక్ష్యం కారణంగా అమెరికాలో మరణించిన జాహ్నవి కందుల కుటుంబానికి అమెరికా ప్రభుత్వం రూ.262 కోట్ల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పరిహారంపై జాహ్నవి తల్లి విజయ లక్ష్మి స్పందించారు. ఆ డబ్బుతో ఏం చేసుకోవాలంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఈ పరిహారంతో మాకు కొంత మేలు జరుగుతుందని అనుకోవచ్చు. ఈ డబ్బుతో మేమేం చేసుకోవాలి. యాక్సిడెంట్ చేసి జాహ్నవి మరణానికి కారణమైన పోలీసు అధికారికి ఎప్పటికీ శిక్ష పడదు.జాహ్నవి మరణంపై జోక్ చేసి, ఆమె ప్రాణానికి విలువ లేదని చెప్పిన మరో ఆఫీసర్ సంగతేంటి? అని విజయ లక్ష్మి వ్యాఖ్యానించారు.
జాహ్నవి తండ్రి శ్రీకాంత్ ఈ పరిహారం ప్రకటించడానికి రెండు రోజుల ముందే గుండెపోటు కారణంగా మరణించారు. ఆయన హెడ్ కానిస్టేబుల్‌గా పని చేసేవారు. కూతురు మరణంతో లాంగ్ లీవ్ పెట్టిన ఆయన ఇటీవలే విధుల్లో చేరారు. విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా కన్నుమూశారు. జాహ్నవికి పరిహారం ప్రకటనపై సియాటెల్ ప్రభుత్వం ఆమె కుటుంబానికి సమాచారం అందించింది. వచ్చే నెలలో అమెరికా రావాలని సూచించింది. పరిహారం ప్రకటన సందర్భంగా అక్కడి అధికారులు జాహ్నవి మరణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సియాటెల్ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ మాట్లాడుతూ జాహ్నవి మరణం బాధాకరమని, అయితే, ఈ పరిహారంతో ఆమె కుటుంబానికి, సన్నిహితులకు కాస్తయినా ఉపశమనం లభిస్తుందన్నారు.


