పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలలో సమతుల ఆహారం ఎంతో ముఖ్యం. జననం తర్వాత తొలి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలే ఉత్తమమైన ఆహారం. ఆరు నెలలు దాటిన తర్వాత నెమ్మదిగా ఘనాహారం ప్రారంభించాలి. ఈ దశలో బియ్యం గంజి, కూరగాయల, పప్పులు వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాలతో మొదలుపెట్టడం మంచిది. కొత్త ఆహారం ఒక్కోటి చొప్పున పరిచయం చేయాలి. దీంతో అలర్జీ లేదా జీర్ణ సమస్యలు ఉన్నాయా అనే విషయం గమనించవచ్చు.
ఎనిమిది నెలలు దాటిన తర్వాత మాంసాహారం స్వల్పంగా పరిచయం చేయవచ్చు. మొదట బాగా ఉడికించిన గుడ్డు పచ్చసొన చిన్న మోతాదులో ఇవ్వాలి. సంవత్సరం వయస్సు పూర్తయ్యాక చికెన్ మరియు చేపలను మెత్తగా చేసి పెట్టవచ్చు. మాంసాహారంలో ఐరన్, జింక్, ప్రోటీన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత నివారణకు, మెదడు అభివృద్ధికి, కండరాల బలానికి తోడ్పడుతుంది. అయితే ఉప్పు, మసాలాలు లేకుండా, పూర్తిగా ఉడికించి, మెత్తగా చేసి ఇవ్వడం తప్పనిసరి.
మాంసాహారం తినేటప్పుడు పాటించాల్సిన ముఖ్య సూచనలు …
• మొదట చిన్న మోతాదుతో ప్రారంభించి, పిల్లల ప్రతిస్పందన గమనించాలి
• ఒకేసారి కొత్త ఆహారాలను కలపకూడదు
• పూర్తిగా ఉడికించి, మెత్తగా చేసి మాత్రమే ఇవ్వాలి
• జీర్ణ సమస్యలు, అలర్జీ లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి • సమతుల ఆహారంలో కూరగాయలు, పప్పులు, ధాన్యాలు కూడా తప్పనిసరిగా ఉండాలి


