పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఈనెల 20న ప్రకటించనున్నట్టు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించింది. ఇందుకోసం షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. ఆ ప్రకారం జనవరి 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య నామినేష్ల దాఖలు ఉంటుందని బీజేపీ జాతీయ రిటర్నింగ్ అధికారి కె.లక్ష్మణ్ తెలిపారు. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు నిర్ణయించారు. నామినేషన్ల స్క్రూటినీ కూడా మధ్యాహ్నం 4 నుంచి 5 గంటల మధ్య జరుగుతుంది. పోలింగ్ అనివార్యమైతే జనవరి 20న ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షుడి ఎన్నికను ప్రకటిస్తామని లక్ష్మణ్ తెలిపారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి.


