వైసీపీ రాజకీయ పార్టీ కాదని, హత్య రాజకీయాలకు డెన్గా తయారైందని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పార్థసారథి మీడియా తో మాట్లాడారు. రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత వైసీపీకి లేదని ధ్వజమెత్తారు. ఆ పార్టీ అనుమతులపైన ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య వెనక ఆ పార్టీ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. ఐదేళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోచుకోవడం, దాచుకోవడమే జగన్ పార్టీ చేసిందని విమర్శించారు. చీకట్లో చంపడం, పగలు వెళ్లి పరామర్శించడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.


